అభిషేకం - గొప్పదనం

అభిషేకం - గొప్పదనం

 • Write By: admin@vedamayee
 • Published In: ROOT
 • Created Date: 2017-10-18
 • Hits: 280
 • Comment: 0

2014 డిసెంబరులో హిందీ భాషలో “పీకే” అని ఒక సినిమా వచ్చింది. ఆ సినిమాలో అన్ని మతాల ఆచారాల్నీ నామమాత్రంగా ఎత్తి చూపిన కథానాయకుడు, హిందూ మతంలో శివుడూ మొదలగు దేవతలకు నిర్వహించే అభిషేకాన్ని మాత్రం ప్రత్యేకంగా తప్పుపట్టాడు. అభిషేకంలో ఉపయోగించే నీరూ పాలూ మొదలగు ద్రవ్యాలు వృథాగా పోతున్నాయనీ, అభిషేకాలకు బదులుగా ఆ నీరు, లేదా పాలను పేదలకు పంచవచ్చనే సందేశాన్ని తెలియజేసాడు. పేదలకు పాలూ నీరు పంచాలనే ఆలోచన మంచిదే అయినా, అభిషేకాలకు బదులుగా ఈ పని చేయాలని చెప్పడమే విడ్డూరం. ఎందుకంటే, దేశంలోనున్న దాదాపుగా అన్ని దేవాలయాల్లోనూ జరిగే అభిషేకాల్లో ఉపయోగించే నీరు, అటు పొలాల్లోకి గానీ, ఇటు నదిలోకి గానీ, లేదా మొక్కలున్నచోటికి గానీ వెళ్ళే ఏర్పాటు చేస్తారు. పాల వంటి ఇతర ద్రవ్యాలు వృథా కాకుండా, అభిషేకం జరుగుతూ ఉండగానే వాటిని పట్టి, అర్చకులు, లేదా వారి సహాయకులు ఈ పదార్థాల్ని ఉపయోగించుకుంటారు. ఎవ్వరికీ ఉపయోగపడకుండా ఆ పాలు నేలపాలవ్వడమనేది ఎక్కడో తరచుగా మాత్రమే జరుగుతూ ఉంటుంది. అది జరగకుండా చూడడం మన కర్తవ్యం. అభిషేకం చేసిన పాలను నేలపాలు కాకుండా పట్టి, బీదసాదలకు ఇచ్చినట్లైతే అభిషేక ఫలంతో పాటుగా పేదలకు ఆహారాన్ని అందించిన ఫలం కూడా దక్కుతుంది. ఈ పదార్థాలు వృథా కాకూడదని మాత్రమే ఆయన చెప్పి యుంటే బాగుండేది. అలా కాక అభిషేక ప్రక్రియనే వ్యతిరేకించడం ఆయనలోనున్న దురుద్దేశాన్ని బయటపెడుతుంది. ఈ విషయం ఇప్పుడెందుకు ప్రస్తావిస్తున్నామంటే, అభిషేక ప్రక్రియకు ఎన్ని ప్రత్యేకతలున్నాయో జనాలకు తెలియాలనే. అవి తెలియక, వీటి పై అన్యమతస్థులు చల్లిన బురదను అభిషేక జలంతో కడిగేయడమే మా ఉద్దేశం.


శివుడు అభిషేక ప్రియుడని పురాణాలు చెబుతున్నాయి. కాబట్టి శివలింగానికి అభిషేకం చేయడం మనకు అనాదిగా వస్తోంది. ఏ శివలింగానికి అభిషేకం చేయాలని మనం చూసినప్పుడు అన్నిటికంటే నర్మదా నదిలో సహజంగా తయారై దొరికే బాణలింగానికి అభిషేకం చేయడం శ్రేష్ఠమని ఆది శంకరాచార్యులు చెప్పారు. అందుకే నేటికీ పండితులు తమ ఇళ్ళల్లో నిత్యం చేసే పంచాయతన పూజలో నర్మదా బాణలింగాన్నే ఉంచుకుని అభిషేకిస్తారు. ఇక అభిషేకం ఏ ద్రవ్యాలతో చేస్తే ఏ ఫలమో కూడా మన మహర్షులు తెలిపారు.

 • శివలింగానికి బియ్యపు పిండితో అభిషేకం చేస్తే అప్పుల బాధ నుంచి విముక్తులవుతారు.
 • కొబ్బరినీటితో అభిషేకం చేస్తే కుటుంబ సభ్యులు ఆయురారోగ్యాలతో వర్ధిల్లుతారు.
 • చెరకురసంతో శివునికి అభిషేకం చేస్తే శత్రుబాధ ఉండదు.
 • ఖర్జూర పండ్లతో అభిషేకం చేసినట్లైతే, ఈతిబాధలు, శత్రువులతో గొడవలూ ఉండవు, ఆరోగ్యంతో పాటు సంపద సిద్ధిస్తుంది.
 • శివునికి విభూతితో అభిషేకం చేస్తే, ఉద్యోగం ప్రాప్తిస్తుంది.
 • నిమ్మరసంతో అభిషేకం చేస్తే, మృత్యుభయం తొలగిపోతుంది.
 • కొబ్బరిపాలతో శివునికి అభిషేకం చేస్తే, సుఖమయ జీవితం లభిస్తుంది.
 • అలాగే ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములూ లభిస్తాయి.
 • ఆవు నెయ్యితో అభిషేకం చేస్తే ధన ప్రాప్తి కలుగుతుంది.
 • నువ్వుల నూనెతో అభిషేకం చేసినచో అపమృత్యువు నశించగలదు.
 • పెరుగుతో అభిషేకించినట్లైతే ఆరోగ్యముతో పాటు సంతానం పొందవచ్చు.
 • పంచామృతంతో అభిషేకం చేస్తే కుటుంబ సభ్యులతో కలిసిమెలసివుంటారు.
 • తేనెతో అభిషేకం చేస్తే అప్పులు, కుటుంబ కలహాలు తీరిపోతాయి.
 • కస్తూరి కలిపిన నీటితో అభిషేకం చేసినచో కీర్తి పెరుగును.
 • పసుపు నీటితో అభిషేకిస్తే సకల శుభాలూ కలుగుతాయి, శుభకార్యాలు జరుగుతాయి.
 • బిల్వదళ జలముతో అభిషేకం చేసిన భోగభాగ్యాలు లభించును.
 • గరిక నీటితో శివాభిషేకం చేసిన, నష్టపోయిన ధనం తిరిగి పొందగలరు.
 • పుష్పోదకము చేత అభిషేకించిన భూలాభం కలుగును.
 • రుద్రాక్ష జలాభిషేకం చేసినచో సకల ఐశ్వర్యములనూ పొందవచ్చునని మహర్షులు తెలియజేసారు.

ఇన్ని ప్రత్యేకతలున్న అభిషేక ప్రక్రియను రానున్న కార్తీక మాసంలోనూ, మహాశివరాత్రికీ వేదపండితుల ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా ఆచరించి, పైన చెప్పిన ఫలాలన్నీ పొందుదాం. అభిషేకం చేసిన ద్రవ్యాలను వృథా కాకుండా, జనులు ఉపయోగించుకునే విధంగా కూడా చూసుకుందాం. అభిషేకంతో శివుని ప్రసన్నం చేసుకోవడం చాలా తొందరగా జరిగే పని. కాబట్టి అభిషేక ప్రియుడైన శివుణ్ణి అభిషేకంతోనే సంతోషపెడదాం. తద్ద్వారా మనమూ సంతోషాలను పొందుదాం.

ఓం నమశ్శివాయ.

Tags:

Leave A Comment